Amrutha Kalasams


మృతం లేనిది అమృతం. అనగా క్షరం కానిది. నాశనం లేనిది. జీవితాన్ని ప్రసాదించేది. మృత్యోర్మా అమృతంగమయ అనేది బోధ. మృత్యువు నుండి అమృతతత్వానికి చేరదమే ఆధ్యాత్మిక తత్వం.

 

కలశం అనగా లక్ష్మి స్వరూపం. అమృత తత్వానికి ప్రతీక.  లేమితో బాధపడేవారికి లక్ష్మీపుత్రులు చేయూతనివ్వాలి. ఆహారాన్ని అందించడమే సాయిభక్తుల లక్ష్యం. కనులకింపైన దృశ్యాలను, వీనులకింపైన భగవన్నామాన్ని ఆహారంగా అందించి ఆత్మవిశ్వాసం,  ఆనందోపాస కల్పించడం సంస్థ లక్ష్యాలు.

 

సాధారణంగా బీదలకు (నారాయణులకు) ఇచ్చే బియ్యం, పప్పు,ఇతర వంట సామగ్రిని అందించడం అమృతకలశాలుగా వ్యవహరిస్తుంటారు.  అవి అన్నీ అమృతతత్వం పొందాలంటే వాటిని భగవన్నామంతో అనుసంధానం గావించాలి. 

 

బియ్యాన్ని కొని పంచడం కన్నా ప్రతి ఇంటినుండి వారు రోజు పిడికెడు బియ్యాన్ని నైవేద్యంగా భగవన్నామముతో సమకూర్చి నెల చివరన అందించాలి.  దానికి అనుబంధముగా ఇచ్చే సామగ్రిని సాయిగాయత్రితో సమీకరించాలి.  అమృతమయం కావాలంటే   భగవన్నామముతో మొదలుపెట్టి దానితోనే ముగించాలి.

 

నెలకొకసారి అమృతకళాశాలు అందించినా, తీసుకున్నవారు వాటిని ప్రతిరోజూ వినియోగిస్తారు కావున వారికి స్వామి అనుగ్రహం నిరంతరాయంగా అందుతుంది. 

 

భోజనం వడ్డించి అందించడం నారాయణ సేవ. అపక్వాహారం నెలకు సరిపడా అందించడం అమృతకలశం.నిత్యభజన, నగరసంకీర్తన, అధ్యయనమండలి, బాల వికాస్ ఎలా జరుగుతాయో అలాగే నారాయణులనోటికి అమృతకలశ కబళం (ముద్ద) అందించాలి.

 

అమృతకలశం అని స్వామి పిలుపులోనే దాని శక్తి, పవిత్రత, ఉపయోగం అర్ధమౌతున్నది. గరుత్మంతునిలా మనం సాయి భక్తులందరము ప్రతి రోజు బీదలకు భోజనం అందించగలిగితే మనహృదయాన్ని స్వామి గరుడవాహనంగా చేసుకుంటారు.