Community Bhajans


ప్రతి భగవన్నామము ఒక దివ్య మంత్రం. నామాన్ని ఒక్కరే జపించడం కన్నా నామ మాధ్యుర్యాన్ని పదిమందికి పంచడమే భజన. అందరూ కలసి ఐకమత్యంతో నామాన్ని గానంచేసి, నామ పాయసాన్ని తనివితీరా జుర్రుకోండి. ఒక్కరే పాడితే కీర్తనం. పదిమంది కలసి ముక్త  కంఠముతో గానం చేస్తే సంకీర్తనం.  అదే భజన.  భజన సామూహికమైనదైతే ప్రయోజనం అధికంగా సిద్ధిస్తుంది. రాగ తాళ భావములతో హృదయాన్ని భగవంతునిపై చేర్చి ఆనందంగా పాడాలి. సామూహిక భజనలవలన పాల్గొన్న ప్రతి ఒక్కరూ తరిస్తారు.

 

సామూహిక భజనలవలన ఐకమత్యం ఏర్పడుతుంది. అహంకారం అణగారి, భక్తికి చోటు కలుగుతుంది. యజ్ఞ యాగాది క్రతువుల కన్నా భజన పవిత్రమైనది. కృతయుగంలో తపస్సుచేతను, త్రేతాయుగములో యజ్ఞ యాగాది క్రతువులచేతను, ద్వాపరములో అర్చన, వ్రతాలు, నోములద్వారాను, కలియుగములో నామస్మరణచేతను ముక్తికలుగుతుంది.

 

రాగ, తాళ, భావాలు ప్రధానమైనవే అంతకుమించి నీవు ఆలపించే భజన అందర్నీ తన్మయులనుగావించడమే ముఖ్యమైనది. భజనలో చివరి వరుస వారు సైతం తాద్యాత్మత చెందాలి. అప్పుడే దాని ప్రయోజనం సిద్ధిస్తుంది. ( సనాతన సారధి నుండి సేకరణ)

 

సామూహిక భజనలో వ్యక్తిగత అభీష్టాలకు తావివ్వరాదు. భజనలో ప్రతిఒక్కరి మనస్సు భగవంతునిపై మరల్చగలగాలి. అప్పుడే అది ఉత్తమ భజన అనిపించుకుంటుంది.

 

భజన వలన రాగ కృతులవలన రోగాలు నయమౌతాయి. శ్వాస కూడా నియంత్రించబడుతుంది. కుటుంబ  సభ్యులతో కలసి వారానికి ఒక్కమారైనా భజనలో పాల్గొని వారి ఐకమత్యాన్ని పెంచుకోవాలి. 

 

సామూహిక భజన వలన హృదయములో శాంతి వర్ధిల్లుతుంది. మానసిక ఉద్రేకాలు అణగారుతాయి. భజన ఆలపించడమువలన ఏర్పడే శబ్దతరంగాల వలన చుట్టూ ఉన్న  వాతావరణం పవిత్రమౌతుంది. ఆ గాలి పీల్చడమువలన శ్వాసక్రియ పరిశుద్ధమౌతుంది.

 

సామూహిక భజన అనేది ప్రతి సాయి భక్తునికి ఒక శక్తివంతమైన ఇంజెక్షన్ లాంటిది.  బలవర్ధకమైన ఔషధము లాంటిది. అది ప్రతిఒక్కరినీ శక్తివంతముగా మారుస్తుంది.